
నిర్మల్, 26 మే (హి.స.)
జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా, నిరంతరాయంగా పూర్తి చేస్తూ ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మణచందా మండలంలోని తిరుపల్లి గ్రామంలోని గోదామును కలెక్టర్ సందర్శించి, ట్రాక్టర్ల ద్వారా జరుగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వెంట వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గోదాం మొత్తం నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు నిల్వ చేసిన ధాన్యం పరిమాణం, అన్లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్యపై ఆరా తీసి, అవసరమైతే మరింత మంది హమాలీలను నియమించి అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు