
కలహండి, 26 మే (హి.స.)
ఒడిశాలోని కలహండి జిల్లాలో
మంగళవారం ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లోకి దిగిన ఆరుగురు వర్కర్లు.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగిన వీరంతా.. అస్పిక్సియేషన్ కు గురైన మరణించినట్లు అధికారులు తెలిపారు. మదన్ పూర్ - రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరియాఖుంట గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియాఖుంట గ్రామంలో ఒక స్థలంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కూలీలు ట్యాంక్ లోపలికి దిగారు. అయితే లోపల విషవాయువులు పేరుకుపోవడంతో ఊపిరాడక ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో కూలీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, అతడిని చికిత్స నిమిత్తం తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి ఒక్కొక్క కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా.. నిర్మాణ రంగంలో కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..