
కాళేశ్వరం, 26 మే (హి.స.)
సరస్వతి అంత్య పుష్కరాల
సందర్భంగా హంపికి చెందిన శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న సాయంత్రమే కాళేశ్వరం చేరుకున్న స్వామీజి నవరత్న హారతిని వీక్షించారు. మంగళవారం ఉదయం సరస్వతి నదిలో పుణ్య స్నానం ఆచరించి అనంతరం ఆలయానికి చేరుకున్న మహాస్వామికి అడిషనల్ కమిషనర్ ఎం. కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహా సరస్వతి అమ్మవారితో పాటు పార్వతి అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో భక్తులకు ఆశీర్వచనం అందించారు. ఆలయం తరఫున స్వామి వారి శేష వస్త్రాలను మహాస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మహేష్, ధర్మకర్తలు, ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..