
అమరావతి, 26 మే (హి.స.)తెలుగుదేశం పార్టీ ఈసారి నిర్వహించే మహానాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కబోతుందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్లలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుతో అనుసంధానం కాబోతున్నారని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఇప్పటివరకు 1851 క్లస్టర్లతో సాంకేతికంగా మ్యాపింగ్, అనుసంధానం పూర్తయిందని తెలిపారు. మిగతా 24 క్లస్టర్లలో నెట్ కవరేజ్ లేకపోవడంతో వారందరిని మండల కేంద్రాలకు తీసుకువచ్చి మహానాడులో పాల్గొనే విధంగా చేస్తున్నామని వివరించారు.
రెండు రోజుల్లో 20 తీర్మానాలపై చర్చ..
మొత్తం 20 తీర్మానాలు రెండు రోజుల్లో పూర్తిచేస్తున్నామని పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ తీర్మానాలపై రెండు రోజుల్లో 65 నుంచి 80 మంది వరకు మాట్లాడుతారని చెప్పారు. మహిళలే కేంద్రంగా ఈసారి మహానాడు జరగనుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు వస్తాయని చెప్పారు. ఏపీలో అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డుపడటం, రాజధాని అమరావతి, పోలవరంపై జగన్ అండ్ కో చేసే కుట్రలపై మాట్లాడతామని అన్నారు. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలపై కూడా మహానాడులో చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.
9 నుంచి 6 గంటల వరకు మహానాడు..
మహానాడులో జగన్ అండ్ కో ప్రజా వ్యతిరేక చర్యలపై చర్చించడంతో పాటు తీర్మానం కూడా చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాజకీయ తీర్మానం కూడా ఉంటుందని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహానాడు జరుగుతుందని చెప్పుకొచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. సాంకేతికంగా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అనుసంధానం చేశామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ