పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు: 'ఆప్'కు అగ్నిపరీక్ష
పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు: 'ఆప్'కు అగ్నిపరీక్ష
AAP


మొహాలీ, 26 మే (హి.స.)

పంజాబ్లో వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్ కౌన్సిళ్లు, 20 నగర పంచాయతీల పరిధిలోని మొత్తం 1,896 వార్డుల కౌన్సిలర్ల ఎన్నిక కోసం మంగళవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రారంభమైంది.

మొత్తం 35.45 లక్షల మంది ఓటర్లు సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, అంతకంటే ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఎక్కడా పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైనట్లు నివేదికలు లేవని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సుమారు 32,000 మంది పోలీసులను, 35,000 మంది ఎన్నికల సిబ్బందిని నియమించింది.

అబోహర్, మొహాలీ, మోగా, బటిండా, బర్నాలా, బటాలా, కపుర్తలా, పఠాన్కోట్ నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న మొత్తం 7,555 మంది అభ్యర్థుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు 1,801 మంది, కాంగ్రెస్ నుంచి 1,550 మంది, బీజేపీ తరఫున 1,316 మంది, శిరోమణి అకాలీదళ్ నుంచి 1,251 మంది, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కి చెందినవారు 96 మంది కాగా, 1,528 మంది స్వతంత్రులు, మరో 13 మంది ఇతర అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లలో 18,33,712 మంది పురుషులు, 17,11,635 మంది మహిళలు, 220 మంది 'ఇతర' కేటగిరీ ఓటర్లు ఉన్నారు.

బ్యాలెట్ పేపర్లకే కోర్టుల గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVMs) స్థానంలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ (PIL)ను పంజాబ్, హరియాణా హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. మే 13నే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ప్రక్రియ చివరి దశకు చేరిన తరుణంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని మే 22న కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. అన్ని ఏర్పాట్లు పూర్తయినందున తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande