
పాకాల:26 మే (హి.స.)
తిరుపతి
జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ సమీపంలో ఓ రైతు పొలంలో సుమారు ఐదు అడుగుల
ఎత్తు కలిగిన శ్రీదుర్గాదేవి (సింహవాహిని) విగ్రహం లభ్యమైంది. రైతు మధ్యాహ్నం పొలం
చదును పనులు చేస్తుండగా ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే దామలచెరువు -
నేండ్రగుంట రహదారి పక్కనే ఉన్న ఇరంగారిపల్లి పొలాల్లో ఒక రైతు తన భూమిని జేసీబీ
యంత్రంతో చదును చేయిస్తున్నారు. ఈ క్రమంలో భూమిలో ఒక పెద్ద రాయి తగలడంతో జేసీబీ
ఆగిపోయింది. అనుమానంతో అక్కడి మట్టిని జాగ్రత్తగా తొలగించగా, సింహ వాహనంపై ఆసీనురాలై ఉన్న
అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే స్థానికులు, కార్మికులు తాళ్ల సహాయంతో
విగ్రహానికి ఎటువంటి దెబ్బతగలకుండా జాగ్రత్తగా భూమిపైకి తీశారు.
భూమిలో
నుంచి అమ్మవారి విగ్రహం దొరికిందనే వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో
భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. విగ్రహానికి
పసుపు, కుంకుమలు సమర్పించి, కర్పూర హారతులతో ప్రత్యేక పూజలు
నిర్వహించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనాస్థలానికి
చేరుకుని వివరాలు సేకరించారు.
లభ్యమైన
విగ్రహాన్ని పరిశీలించిన కొందరు స్థానికులు, విగ్రహం మరియు దాని పీఠం యొక్క
ఆకృతిని బట్టి ఇది కొత్తగా ఆధునిక యంత్రాలతో చెక్కినట్లుగా కనిపిస్తోందని
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇక్కడ పురాతన ఆలయం ఉండి
ఉండవచ్చని భావిస్తున్నారు. విగ్రహం యొక్క పురాతనతను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు
అధికారులు పురావస్తు శాఖకు సమాచారం అందించారు. వారి పరిశోధన తర్వాతే ఈ విగ్రహం
వెనుక ఉన్న అసలు నిజాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi