
తిరుమల, 26 మే (హి.స.)
తిరుమలలో భక్తుల రద్దీ 24/7 కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు మరికొద్దిరోజుల్లో ముగియనుండటంతో కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు భక్తులు తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి స్వామివారి ఉచిత సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అంతా నిండిపోయింది. శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తరువాత సర్వదర్శనానికి క్యూలోకి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి 18-24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే.. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందినవారికి 4-6 గంటల్లో దర్శనం అవుతుందని పేర్కొన్నారు. నిన్న (సోమవారం) స్వామివారిని 89,399 మంది భక్తులు దర్శించుకోగా.. 49,985 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు సమకూరింది. నిన్న మొత్తం భక్తులకు 4.88 లక్షల లడ్డూలను స్వామివారికి విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. అలాగే 3751 మంది భక్తులు వైద్య చికిత్స తీసుకున్నట్లు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV