మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి
Mavoists


హైదరాబాద్, 26 మే (హి.స.)

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, ఆయన భార్య, స్టేట్ కమిటీ మెంబర్ మెడారి ధనమ్మ అలియాస్ లత ఇవాళ తెలంగాణ పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. హైదరాబాద్ లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో వారు లొంగిపోగా, పోలీసులు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రకటించిన పునరావాస ప్యాకేజీ కింద నరహరికి రూ.25 లక్షలు, ఆయన భార్య ధనమ్మకు రూ. 20 లక్షల విలువైన చెక్కులను డీజీపీ అందజేశారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పసునూరి నరహరి ప్రస్థానాన్ని వెల్లడించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామంలో 1962లో జన్మించిన నరహరి, స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే పదో తరగతి వరకు చదివారని తెలిపారు. అనంతరం ఎల్బీ డిగ్రీ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న రోజుల్లో ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) నాయకులతో ఏర్పడిన పరిచయం ఆయనను అజ్ఞాతంలోకి నడిపించిదన్నారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కుంట దళంలో ప్రస్థానాన్ని ప్రారంభించిన నరహరి, ఆ తర్వాత గోపన్న దళం, రామన్న స్క్వాడ్లలో దండకారణ్యంలో చురుగ్గా పనిచేశారని వెల్లడించారు. 1986లో హైదరాబాద్ సిటీ ఆర్గనైజర్, బెంగళూరులో డెన్ కీపర్గా వ్యవహరించారని డీజీపీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande