
ఉట్నూర్ 27 మే (హి.స.)
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న 14 కళాశాలలను విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిరిజనులు విద్యకు దూరమవుతున్నారని, పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మళ్లీ కళాశాలలో చేరకుండా ఉండే అవకాశాలు ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు. అదే పాఠశాలలో కళాశాలలు విలీనమై ఉంటే ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసిస్తారని తెలుపుతున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలోనే కొనసాగించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవోకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.ట్రైబల్ గురుకుల పాఠశాలలను ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు నిర్వహించేవారు. ఇప్పుడు అప్గ్రేడ్ పేరిట ఇంటర్ కళాశాలలను వేరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు రావడంతో ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకానున్నది. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీ విభాగాలను వేర్వేరు సంస్థలుగా విభజించారు. దీంతో ఇంటర్మీడియట్ సెక్షన్ ఇకపై స్వతంత్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా కొనసాగనున్నాయి. ఈ విభజనతో విద్యా నాణ్యత పెరుగుతుందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ కోచింగ్ ఇవ్వడానికి దోహద పడతాయని, ల్యాబ్, లైబ్రరీ, వసతులు పెరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi