
ముంచంగిపుట్టు గ్రామీణం, : , 27 మే (హి.స.)
మాచ్ఖండ్ జలవిద్యుత్కేంద్రంలో మంగళవారం పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. నాలుగు రోజుల కిందట చోటుచేసుకున్న అగ్నిప్రమాదం అనంతరం మరమ్మతు పనులు చేపట్టారు. స్థానికంగా విద్యుదుత్పత్తి లేకపోవడంతో విశాఖ ఫీడర్ నుంచి విద్యుత్తును తీసుకుని ఒనకఢిల్లీ, మాచ్ఖండ్, జోలాపుట్ క్యాంపులతోపాటు పరిసర గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో 11 కేవీ బ్రేకర్ వద్ద పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు చెలరేగకుండా నిలువరించారు. పేలుడు వల్ల మూడు క్యాంపులకు విద్యుత్తు సరఫరా చేసే 11 కేవీ తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది. క్యాంపులతోపాటు గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలకు ఉపక్రమించారు. వర్షం, చీకటి కారణంగా మరమ్మతు పనులకు ఆటంకం ఏర్పడింది. అధిక లోడు కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని ఎస్ఈ అప్పాజీ చెప్పారు. ఆయనతోపాటు ఈఈ (జనరేషన్) గోవిందరాజులు, ఏడీఈలు సత్యకిరణ్, చంద్ర, ఓబుల్రెడ్డి పనులు పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ