
హైదరాబాద్, 27 మే (హి.స.)
సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) పూర్వ వైభవం తీసుకురావడానికి సాధారణ నిరసనలు సరిపోవని, ఉధృతమైన క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం అంతర్గత సమావేశాలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం కాకుండా, ఇకపై ప్రత్యక్ష పోరాటాల ద్వారా కార్మికుల్లో నమ్మకాన్ని పెంపొందించాలని స్పష్టం చేశారు.
కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మందమర్రి ఏరియాలోని జీఎం ఆఫీసు వద్ద, హైదరాబాద్లోని సింగరేణి భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేయాలని, అవసరమైతే రైల్ రోకోల వంటి తీవ్రమైన ఆందోళనలు చేపట్టాలని సుమన్ సూచించారు. ప్రజాసమస్యలపై గట్టిగా నిలబడి పోరాడే క్రమంలో కేసులు ఎదురైనా, జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెనకడుగు వేయవద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పాలన మూడేళ్లకు చేరుకుంటున్న తరుణంలో, గట్టిగా ఒత్తిడి తెస్తేనే కార్మిక వర్గం తమ వైపు నిలుస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి నిరంతర పోరాటాల ద్వారానే అధికార కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్ మాత్రమే తమ పక్షాన నిలుస్తుందనే భావన కార్మికుల్లో బలపడుతుందని ఆయన విశ్లేషించారు.
ఇదే క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీ పిలుపునిస్తున్న ధర్నాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనపై సుమన్ సమీక్షించారు. వడ్ల కొనుగోలు సమస్యలపై జాతీయ రహదారులను దిగ్బంధిస్తే రైతుల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. భీమారం, కిష్టంపేట ప్రాంతాల్లో జరిగిన హైవే రాస్తారోకోలలో స్థానిక రైతుల కంటే బీఆర్ఎస్ కార్యకర్తలే అధిక సంఖ్యలో హాజరయ్యారని వాస్తవ పరిస్థితిని వివరించారు. ప్రజలను ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి తీసుకురావడానికి నిరసనల శైలిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ప్రసంగాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే సుమన్ చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యల తీవ్రతను గుర్తించిన సాంకేతిక బృందం ఆ భాగాన్ని లైవ్ ఫీడ్ నుండి తొలగించినప్పటికీ, అప్పటికే ఆ ప్రసంగ పాఠం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi