
అమరావతి, 27 మే (హి.స.)
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన తొలి మహానాడు ప్రసంగం సందర్భంగా నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మహానాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా భారీ ప్రకటన చేయబోతున్నట్టు ముందుగానే ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఆయన భారీ ప్రకటన చేశారు. మహిళలు, యువతకు పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
నూతన హోదాలో తొలిసారి మహానాడు ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్... మహిళా సాధికారతపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా... రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం అని లోకేశ్ సంచలన ప్రకటన చేశారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని నమ్మిన పార్టీ టీడీపీ అని, అందుకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నారా లోకేశ్ చేసిన ఈ భారీ అధికారిక ప్రకటనతో మహానాడు సభ ప్రాంగణంలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు నుంచే లోకేశ్ చేయబోయే ప్రకటనపై రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈ నిర్ణయంతో తెరపడింది. పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా రాబోయే కాలంలో సరికొత్త నాయకత్వాన్ని తయారుచేస్తామని లోకేశ్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi