
ఢిల్లీ, 27 మే (హి.స.)
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. తీవ్రమైన వేడి పరిస్థితుల్లో పలు జాగ్రత్తలు సూచించారు. నిత్యం తగినంత నీరు తాగాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదిక ద్వారా ఆయన ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. వీలైనంత వరకు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు.
అతి తీవ్రమైన వేడి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని అన్నారు. వృద్ధులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలని, ఇళ్లు, దుకాణాల వద్ద ఆరుబయట పక్షులు, జంతువుల కోసం నీటిని ఉంచాలని కోరారు. ఎండ కారణంగా ఎవరికైనా ఏమైనా అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేశారు.
తల తిరగడం, వికారం, అలసట వంటి వడదెబ్బ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. చుట్టూ ఉన్నవారిలో ఎవరైనా అకస్మాత్తుగా సృహ కోల్పోయినట్లు అనిపించినా, నీరసించినా వెంటనే వారిని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లాలని అన్నారు. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడుతామని పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పిల్లలు, వృద్ధులు, రైతులు, కార్మికులపై ఎక్కువగా ఉంటోందని అన్నారు.
రాబోయే రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, బీహార్, ఒడిశా, తెలంగాణ, కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. మే 29 నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే కురిసే అవకాశం ఉందని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi