
అమరావతి, 28 మే (హి.స.)
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడువ్యాఖ్యానించారు. నీటిపారుదల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు. జలం ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈరోజు (గురువారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడులో ‘నీటిపారుదల అభివృద్ధి - నదుల అనుసంధానం’పై మంత్రి నిమ్మల మాట్లాడారు. పల్లెల నుంచి పట్టణాల నుంచి.. మహానగరాలుగా అభివృద్ధి చెందిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. ఈ సత్యాన్ని గ్రహించే.. అనాడు మాజీ సీఎం ఎన్టీఆర్ దగ్గర నుంచి.. నేటి చంద్రబాబు వరకు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడాల్సి వస్తే.. తెలుగుదేశం పార్టీకి ముందు.. ఆ తర్వాత అనే విధంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రూ.18 వేల కోట్ల అప్పులు మిగిల్చారని మండిపడ్డారు. హంద్రీనీవా రాయలసీమ జీవనాడి అని.. అలాంటి హంద్రీనీవా గత ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేజ్–1ను పూర్తి చేసి.. 727 కిలోమీటర్లకు సీఎం చంద్రబాబు కృష్ణ జలాలను తీసుకువెళ్లారని ప్రస్తావించారు.
తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను పట్టించుకోలేదు..
తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తే.. గొడ్డలిపార్టీ కనీసం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 2024లో తుంగభద్ర ప్రాజెక్టులోని 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అప్పటికప్పుడు జలాశయాల ఇంజినీరింగ్ నిఫుణుడు కన్నయ్యనాయుడుకి ఫోన్ చేశారని వివరించారు. వరద కొనసాగుతుండగానే గేటు పునర్నిర్మాణం చేసి 80 టీసీఎంల నీటిని సముద్రం పాలు కాకుండా చూశారని అన్నారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే రాయలసీమకు ఎందుకు గొడ్డలి పోటు వేశారో సమాధానం చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ