11 లక్షల మంది పార్టీ.క్యాడర్ హాజరై.మహానాడు మరో సంచలన రికార్డు
11 లక్షల మంది పార్టీ.క్యాడర్ హాజరై.మహానాడు మరో సంచలన రికార్డు
చంద్రబాబు


అమరావతి, 28 మే (హి.స.)

11 లక్షల మంది పార్టీ క్యాడర్ హాజరై.. మహానాడు మరో సంచలన రికార్డు నమోదు చేసుకుందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ అటెండెన్స్లో వారంతా నమోదు చేయించుకున్నారని వివరించారు. గురువారం మహానాడులో మంత్రి లోకేశ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు. పార్టీలో ఎప్పటికప్పడు సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి పార్టీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. పదవికాల పరిమితిని తీసుకు వచ్చింది తామేనని ఈ సందర్భంగా నారా లోకేశ్ గుర్తు చేశారు. ఎన్నికల గురించి కాదు.. సిద్ధాంతపరంగా తాము సంస్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు.

గత మహానాడులో తాను ఆరు శాసనాలు గురించి చెప్పానని ఈ సందర్భంగా నారా లోకేశ్ గుర్తు చేశారు. ఇప్పడు ‘నా తెలుగుదేశం.. నా బాధ్యత’ అని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎవరైనా తన ప్రసంగం ముందు నా తెలుగుదేశం.. నా బాధ్యత అని చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. Gen Z ఏమి ఆశిస్తుందో... ఆలోచించి అందుకు అనుగుణంగా తాము ముందుకు వెళ్లాల్సిఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్లాగా తాము ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకోమని చెప్పారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తామన్నారు.

జగన్ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలలో నామినేషన్ల పేపర్లు లాక్కుని ఎలా వ్యవహరించారనేది అందరం చూశామన్నారు. అందుకనే ఆయన ఏకగ్రీవాలు చేస్తే ఊరుకోమన్నారని చెబుతున్నారని తెలిపారు. నాడు ఆయన చేశాడు కాబట్టే నేడు భయపడుతున్నారంటూ జగన్ వైఖరిని ఈ సందర్భంగా లోకేశ్ ఎండగట్టారు. డీఎస్సీ పరీక్షలు, నియామకాలు పూర్తయిన ఆరు నెలలు తర్వాత అందులో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించడం ఏమిటని నారా లోకేశ్ సందేహం వ్యక్తం చేశారు. ఆయనకు ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలిగినట్లుందంటూ వ్యంగ్యంగా అన్నారు. అప్పట్లోనే కోర్టులో డీఎస్సీపై జగన్ ఎన్నో కేసులు వేయించారని గుర్తు చేశారు. అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని.. కానీ మమ్మల్ని ఎక్కడా తప్పు పట్టలేదని నారా లోకేశ్ వివరించారు.

ఈ అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని జగన్కు తాను సవాల్ విసిరానని లోకేశ్ గుర్తు చేశారు. దీనిపై జగన్ స్పందిస్తే బాగుంటుందన్నారు. ఒక్క టీచర్ కానీ.. అధికారి కానీ డీఎస్సీపై ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. డీఎస్సీపై నాకు కానీ, ఏ అధికారికి గానీ ఒక్క రూపాయి అయినా ఇచ్చినట్లు నిరూపించాలని జగన్ పార్టీలోని నేతలను ఈ సందర్భంగా లోకేశ్ డిమాండ్ చేశారు. లెవన్ టీమ్ కెప్టెన్కు దమ్ముంటే నిరూపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్కు లోకేశ్ సూటిగా సవాల్ విసిరారు.

జగన్.. ఆయన కుటుంబ చర్రితను తవ్వి తీయించారన్నారు. రాజారెడ్డి చేసిన అరాచకాలు, బెరైటీస్ గనుల కోసం వాళ్లు ఎంతమందిని హత్య చేశారనేది జనానికి తెలియచేసిన ఘనత వైఎస్ జగన్దేనని ఈ సందర్భంగా నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తాను వైఎస్ జగన్ కాదని.. ఆయన లాగా తన వద్ద గొడ్డలి లేదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎంను ఉద్దేశించి నారా లోకేశ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande