
అజ్మీర్ (రాజస్థాన్,) 28 మే (హి.స.)
తన తల్లికి గుండెనొప్పి రావడంతో హుటాహుటిన కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకొని నలుగురు సజీవ దహనం అయ్యారు. ఈ షాకింగ్ సంఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లా బోరాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్సింగ్ చౌదరి తల్లికి గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెనొప్పి (సీనే మే దర్ద్) రావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో బోరాడ సమీపంలో కారు వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా ఇంజిన్లో మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే కారు మొత్తం వ్యాపించాయి. కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పూర్తిగా జామ్ అయిపోవడంతో లోపల ఉన్నవారు తలుపులు తెరుచుకుని బయటకు రాలేకపోయారు.
కారు రోడ్డుపైనే అగ్నిగోళంలా మారిపోవడంతో.. లోపల ఉన్న మాజీ సర్పంచ్ రామ్సింగ్, ఆయన భార్య, ఆయన తల్లి, జిల్లా పరిషత్ సభ్యురాలైన పూసీ దేవి తీవ్రమైన మంటల్లో చిక్కుకుపోయారు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులోనే నలుగురూ నిలువునా ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న బోరాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, షార్ట్ సర్క్యూట్ వల్లే కారులో మంటలు చెలరేగాయా లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ముఖ్య నేతలు ఇలా దారుణంగా మరణించడంతో అజ్మీర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..