
అమరావతి, 28 మే (హి.స.)
పాడేరు: బక్రీద్ సందర్భంగా గోవులను వధిస్తే చర్యలు తప్పవని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ఎం.కరుణాకరావు తెలిపారు. బుధవారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. జంతు సంరక్షణ చట్టాలు, పశువుల సంక్షేమ నియమాలను అందరూ గౌరవించాలని పేర్కొన్నారు.
సీలేరు, న్యూస్టుడే: గోవుల అక్రమ రవాణా నియంత్రణకు సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జెన్కో తనిఖీ కేంద్రం సీఆర్పీఎఫ్, సివిల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: ముస్లిం సోదరులు బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలని చింతపల్లి సీఐ వినోద్బాబు కోరారు. స్థానిక ముస్లిం పెద్దలతో బుధవారం తన కార్యాలయంలో మాట్లాడారు. జంతు సంరక్షణ చట్టాల అమలు, పశువుల అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎస్సై వీరబాబు, మసీదు గురువు సాహిద్, కోఆప్షన్ సభ్యుడు నాజర్వలీ, సత్తార్, దర్గా తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: జంతు సంక్షేమ చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యతని అరకులోయ ప్రాంతీయ పశువైద్యశాల ఇన్ఛార్జి సహాయ సంచాలకులు డా.సాగిరి గణేశ్వరరావు అన్నారు. జంతు హింస తదితర అనుమానాస్పద, అక్రమ కార్యకలాపాలు గమనిస్తే సమీప పోలీసు, లేదా పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ