
హైదరాబాద్, 28 మే (హి.స.)
సవాళ్లు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సవాల్ పై ఆయన స్పందించారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చాకే ఓట్లు అడుగుతామని మంత్రి పొంగులేటి అన్నారని, ఇచ్చినమాటను నిలబెట్టుకునే దమ్ము ఆయనకి లేదా అని ప్రశ్నించారు. శపథం చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సవాల్ చేసిన దానిప్రకారం 20 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అయ్యాకే పొంగులేటి ప్రజలను ఓట్లు అడగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తాము డబ్బా ఇళ్లు, 70 వేలతో అగ్గిపెట్టె ఇండ్లు కట్టలేదని, మేం కట్టిన ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. 7 ఇందిరమ్మ ఇళ్లకు సమానమని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమ పార్టీ ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ అన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించి.. స్వగృహ స్వప్నాలను సాకారం చేసిన ఘనత తమదేనన్నారు. ఒక్క హైదరాబాద్ లోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. అంతకుమించి హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టాలని డిమాండ్ చేశారు.
తాము గృహ నిర్మాణ యజ్ఞాన్ని తలపెడితే.. కాంగ్రెస్ గృహమేధ యాగం చేస్తూ విధ్వంసం సృష్టిస్తోందని దుయ్యబట్టారు. ఇటుకలు పేర్చి ఇండ్లు కడితే.. పేదల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు కాంగ్రెస్ లీడర్లని ఆరోపించారు. వీకెండ్లో మంది కొంపల్ని కూల్చి వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు. రెండున్నర ఏండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని..పడగొట్టిన ఇండ్లు ఎన్ని.. శ్వేత పత్రం ప్రకటించే ధైర్యం వుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దీపావళి
బాంబులు పేలుస్తామని.. తుస్సు మనిపించిన తుపేల్ మినిస్టర్..మిస్టర్ బాంబులేటి అంటూ మంత్రి పొంగులేటిపై ఫైరయ్యారు. తమకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం తెలుసు.. ఆత్మాభిమానంతో బతకడం తెలుసన్నారు.
అడ్డదారుల్లో కొడుకు కంపెనీకీ వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు, అక్రమ క్రషర్లు నడుపుతూ..అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు, రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకొని.. భూ భారతిలో బ్లాక్ లిస్టులు.. బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే లాండ్ గేమ్స్, గూండాలను ఉసిగొల్పి.. సామాన్యులపై దౌర్జన్యాలు చేసి.. భూములను బుక్క పెట్టడం, బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం తమకు తెలీదన్నారు. ఎన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా, డైవర్షన్ డ్రామాలు ఆడినా.. 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే మేనిఫెస్టేలో ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..