
యాదాద్రి భువనగిరి, 28 మే (హి.స.)
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి రైతు పక్షపాత ప్రభుత్వమని, అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, తెలంగాణ రైతాంగం ఎవరూ వారి ఉచ్చులో చిక్కొద్దని ఆయన పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. అనంతరం సమీపంలోని రామాజిపేట వద్ద గల ప్రభుత్వ గోదాములకు చేరుకుని, అక్కడ నిల్వ ఉంచిన కొనుగోలు ధాన్యపు నిల్వలను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
రబీ సీజన్లో ఇంతటి భారీ దిగుబడి రావడం సరికొత్త రికార్డు అని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాల తోటే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. కొనుగోళ్లలోనూ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టిస్తోందని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేశామని వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు