ముస్లిం మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముస్లిం మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కోమటి రెడ్డి


నల్గొండ, 28 మే (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డు ఈద్గాలో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ బక్రీద్ అని అన్నారు. కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదని, ఇది మానవాళికి ఒక గొప్ప జీవన సందేశమని చెప్పారు. నల్లగొండ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అపారమైన విశ్వాసాన్ని, త్యాగ నిరతిని చాటి చెప్పే గొప్ప పండుగని అన్నారు. తనకు అత్యంత ప్రియమైనదాన్ని సైతం దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధపడటమే నిజమైన భక్తి అని అన్నారు.

జీవితంలో త్యాగ నిరతిని దైనందిన అలవర్చుకోవాలని చెప్పారు. బక్రీద్ అంటేనే త్యాగమని, ఉన్న దాంట్లో లేనివారికి పెట్టడం, పేదలను ఆదుకోవడం, సమాజంలో అందరూ బాగుండాలని కోరుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాహుల్ గాంధీ రాజకీయాలకు అతీతంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారని, అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలు సమానమే, అందరు కలిసి మెలిసి ఉండాలనే గొప్ప సందేశంతో యాత్ర చేశారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించారని, దానివల్ల విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండలో మతసామరస్యానికి, గంగా-జమునా తెహజీబ్క నిలువెత్తు సాక్ష్యంమని అన్నారు.

30 ఏళ్లుగా ఏ ఒక్క చిన్న ఘటన జరగకుండా కలిసి మెలిసి ఉంటున్నామని, నల్లగొండ ప్రత్యేకతని చెప్పారు. అందరి ముఖాల్లో సంతోషం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, విద్య, ఉపాధి రంగాల్లో మైనార్టీ సోదరులు ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. విద్య కోసం ఆధునిక పాఠశాలలు నిర్మిస్తున్నామని, ఉపాధి కల్పన కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలోనే షాదీఖానాకు ల్యాండ్ అలాట్ చేసి, త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్పీ శరత్ చంద్ర పవార్, ముస్లిం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande