
బెంగళూరు, 28 మే (హి.స.): సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.కర్ణాటక రాజకీయాల్లో కొన్ని నెలలుగా సాగుతున్న అంతర్గత అధికార పోరాటం చివరకు ఒక ముగింపునకు వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర పగ్గాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించడంతో 77 ఏళ్ల సీనియర్ నేత సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు. గురువారం ఉదయం తన నివాసంలో మంత్రులు, సహచరులకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య.. ఆ తర్వాత గవర్నర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అయితే, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బుధవారం రాత్రి కుటుంబ అత్యవసర పని నిమిత్తం ముంబై వెళ్లడంతో, ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్వల్ప అనిశ్చితి నెలకొంది. గవర్నర్ అందుబాటులో లేకపోయినప్పటికీ, సీఎం కార్యాలయ సిబ్బంది రాజీనామా లేఖను గవర్నర్ ఆఫీస్కు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నాటకీయ పరిణామాలకు ముందు బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకునేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో పెద్ద పీట వేయడంతో పాటు, రాజ్యసభ బెర్త్ ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. తాను ఇచ్చిన మాట ప్రకారం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధరామయ్య తన అనుచరుడైన సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే వద్ద స్పష్టం చేశారు. విధాన సౌధలో నెహ్రూ వర్ధంతి కార్యక్రమానికి హాజరై, కుల గణన నివేదికను స్వీకరించిన అనంతరం సీఎం కార్యాలయ సిబ్బంది ఆయనకు భావోద్వేగంగా వీడ్కోలు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi