
హిందూపురం, 28 మే (హి.స.)మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన ఓ పోస్టు పెట్టారు.
‘తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు, మా పూజ్య తండ్రిగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు!. నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక శకం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ‘ఆత్మగౌరవాన్ని’ పరిచయం చేసిన ధీరుడు. వెండితెరపై దేవుడిగా మెరిసినా, ప్రజాసేవలో నాయకుడిగా నిలిచినా.. ఆయన జీవించిన విధానం, చూపిన బాట ఎప్పటికీ ఆదర్శనీయం.‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతాన్ని నమ్మి, చివరి శ్వాస వరకు సామాన్యుడి సంక్షేమం కోసమే తపించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఒక కొడుకుగా ఆయన కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఆయన ఆశయాల వారసత్వాన్ని మోసే భాగ్యం కలగడం నా జీవితానికి దక్కిన అత్యున్నత గౌరవం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో, అభిమానుల గుండె చప్పుళ్లలో ఎప్పటికీ అమరుడే!. నాన్నగారి ఆశీస్సులు, ఆయన నేర్పిన క్రమశిక్షణే నన్ను ప్రతి అడుగులోనూ ముందుండి నడిపిస్తున్నాయి. ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ, సమాజానికి ఉపయోగపడేలా జీవించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV