
అమరావతి, 28 మే (హి.స.)తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళులు అర్పించారు. గురువారం ఈ మేరకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా తమ స్మృతులను పంచుకున్నారు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే మాటకు ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు. సినీ, రాజకీయ రంగాల్లో ధృవతారగా వెలిగిన ఆయన, తెలుగు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్త అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. అణగారిన వర్గాలకు అండగా నిలిచి, సంక్షేమానికి చిరునామా అయ్యారు. కోట్లాది హృదయాల్లో కొలువైన ఆ మహామనికి జోహార్లు. తాతా.. మీరే మాకు నిత్య నూతన స్ఫూర్తి అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.
ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కూడా తన తండ్రిని స్మరించుకున్నారు. మూడు తరాలుగా చూస్తున్నాను. ఎన్టీఆర్ అంటే నేటి తరానికి కూడా అదే గౌరవం. చెప్పిన మాటను ఆచరణలో పెట్టి చూపించే ఆయన నిబద్ధతే తెలుగువారికి 'అన్నగారిని' చేసింది అని ఆమె తన పోస్టులో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను, ఆశయాలను కుటుంబసభ్యులు స్మరించుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi