అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్
అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్
Bandi sanjay


హైదరాబాద్, 06 మే (హి.స.)కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, వడ్ల కొనుగోళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరని ప్రశ్నించారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో చాలాచోట్ల వడ్లు కొట్టుకుపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. అన్నదాతల బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అంటూ కేంద్ర మంత్రి నిలదీశారు.

కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతుంటే పట్టించుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల ఆరుగాలం కష్టమంతా నీళ్లపాలవుతోందన్నారు. ప్రతి గింజ కొనుగోలుకు కేంద్రమే డబ్బులు ఇస్తుంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని అన్నారు. వడ్లను కొనుగోలు చేసినందుకు కమీషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమే చెల్లిస్తోందని.. అయినా వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం ఎందుకని మండిపడ్డారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు గాను 16 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కూడా కొనలేని దుర్మార్గపు ప్రభుత్వమిది అంటూ విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రికి ఢిల్లీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రైతులు పడుతున్న కష్టాలను ప్రస్తావిస్తే ఎదురు దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన వడ్లను కనీన మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే అని.. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. సీఎం సహా మంత్రులంతా యాసంగి వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande