మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్
భాగ్యనగరంలో మహిళల భద్రతపై పోలీసు శాఖ కీలక చర్యలు చేపడుతోంది.
Sumathi


హైదరాబాద్, 06 మే (హి.స.)భాగ్యనగరంలో మహిళల భద్రతపై పోలీసు శాఖ కీలక చర్యలు చేపడుతోంది. నగర మహిళా పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్లోకి దిగి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నిన్న(మంగళవారం) అర్ధరాత్రి ఈ ఆపరేషన్ చేపట్టారు.

నిన్న అర్ధరాత్రి మహిళా కమిషనర్ సుమతి ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ మహిళలా దిల్సుఖ్నగర్ బస్టాండ్కు వెళ్లారు. బస్సు కోసం వేచిచూస్తున్నట్టుగా ఉంటూనే అక్కడి పరిస్థితులను గమనించారు. ఆమె పోలీస్ కమిషనర్ అని తెలియక కొందరు యువకులు, పోకిరీలు ఆమెను వేధించినట్లు సమాచారం. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆమె అక్కడే ఉండి మహిళలు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్లో కమిషనర్ సుమతిని సుమారు 40 మంది యువకులు ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది.

దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఆపరేషన్లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడం, మహిళలను వేధించే యువకులపై నిఘా పెట్టడం, రాత్రివేళల్లో భద్రతా పరిస్థితులను పరిశీలించినట్లు తెలుస్తోంది.

పోలీసుల ప్రాథమిక విచారణలో.. కొందరు యువకులు మద్యం మత్తులో ఉండటం, మరికొందరు గంజాయి మత్తులో తిరగడం, రాత్రివేళల్లో మహిళలను ఇబ్బంది పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ అనంతరం పోలీసులు 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసులు యువకులను ప్రశ్నిస్తూ.. చదువుకునే వయసులో ఇలాంటి చర్యలు ఎందుకు?, మహిళలను వేధించడం వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించినట్లు సమాచారం.

దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అధిక సంఖ్యలో హాస్టల్స్ ఉండటంతో రాత్రి వేళల్లో యువకుల సంచారం ఎక్కువగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో అల్లరి మూకలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande