
అమరావతి, 07 మే (హి.స.)
రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో పలు కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమెరికా వెలుపల గూగుల్ ఇంత భారీ పెట్టుబడి పెట్టడాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే.. గూగుల్ను మించి విశాఖలో రిలయన్స్ సంస్థ రూ. 1,08,010 కోట్లతో డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ను కూడా రిలయన్స్ స్థాపిస్తుంది. ఈ పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. అలాగే కడపలో రూ. 12,287 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు, తిరుపతిలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు పలు పెట్టుబడులకు ఎస్ఐపీబీ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రానికి రూ. 2,01,023 కోట్ల పెట్టుబడులు వస్తాయి. వీటితో 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ప్రతిపాదనకు ఆమోదం తెలపాల్సిందేనని, ప్రతి ఒప్పందమూ గ్రౌండ్ కావాల్సిందేనని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఒక పారిశ్రామిక ప్రతిపాదన రాష్ట్రానికి వచ్చాక అనుమతుల నుంచి పరిశ్రమ స్థాపన దాకా నిర్దిష్ట కాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా ఆలస్యం జరిగేందుకు వీల్లేదన్నారు. అనుమతుల మంజూరులో ‘ఏపీ బ్రాండ్’ స్పష్టంగా కనిపించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ