
పిఠాపురం, 07 మే (హి.స.)
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతల్లో ఆ పార్టీ హై కమాండ్ మార్పు చేసింది. ప్రస్తుత ఇన్చార్జ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ నియామకంపై కసరత్తును టీడీపీ హై కమాండ్ ప్రారంభించింది. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు అధిష్ఠానం స్పష్టం చేసింది.
ఈ విషయంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పలురకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఫైనల్గా పార్టీ బాగుండేలా హై కమాండ్ చూడాలని అన్నారు. మంత్రి నారా లోకేశ్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారని తెలిపారు. టీడీపీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా సహకరిస్తానని వర్మ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ