
అమరావతి, 07 మే (హి.స.)
సమాచార పౌర సంబంధాల శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడుఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద ఐ అండ్ పీఆర్ వ్యవస్థ సరిగా పనిచేయకుండా కేవలం ఓ ఆభరణంలా తయారైందని సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానికంగా ఉండే ఇన్ఫ్లూయెన్సర్ల సాయంతో చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
కొందరు అధికారుల పనితీరు అభివృద్ధిని అడ్డుకునేలా ఉండటం సరికాదని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటామంటే అరకులో కాఫీ పంట ఉంటుందా..? అని నిలదీశారు. అధికారులు మారి అభివృద్ధికి ఊతం ఇవ్వాలని హితవు పలికారు. కొందరు అధికారుల సర్వీసులను ఎందుకు అమల్లోకి తీసుకోవడం లేదని నిలదీశారు.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (గురువారం) సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
కలెక్టర్ల మధ్య, జిల్లాకు జిల్లాకు మధ్య పోటీ ఉండాలని సీఎం సూచించారు. ఇన్నోవేటివ్ ఐడియాలు తీసుకువస్తే అధికారులను మెంటర్గా నియమిస్తామని చెప్పుకొచ్చారు. ఎంతవేగంగా పనులు చేస్తే అంతేవేగంగా ఫలితాలు వస్తాయని సూచించారు. ప్రతి ఫైలులోని సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు రిజల్ట్ ఓరియెంటేషన్తో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ