
హైదరాబాద్, 07 మే (హి.స.)
రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, రవాణాలో ఎలాంటి అడ్డంకులు కలగకుండా చూసేందుకు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లైస్ (Civil Supplies) విభాగం విజ్ఞప్తి మేరకు.. జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని జిల్లా రవాణా అధికారులను (DTOs) ఆదేశించింది. ధాన్యం సేకరణ కేంద్రాల నుండి నిల్వ కేంద్రాలు, రైస్ మిల్లులకు రవాణా సాఫీగా సాగేందుకు.. ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించడానికి తగినన్ని సరుకు రవాణా వాహనాలను (Goods Vehicles) అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
వాహనాల కేటాయింపు, తరలింపులో ఎలాంటి జాప్యం జరగకుండా జిల్లా కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి ఉత్వర్వులలో పేర్కొన్నారు. రవాణాలో పాల్గొనే అన్ని వాహనాలకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలన్నారు. వాహనాల కదలికలో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా అధికారుల సాయంతో తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థలో ఎక్కడా అంతరాయం కలగకుండా చూడటమే లక్ష్యంగా రవాణా కమిషనర్ ఇలంబరితి ఈ ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు