
హైదరాబాద్, 07 మే (హి.స.)రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్గా డ్రగ్స్ కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం తొలిసారిగా ఈగల్ ఫోర్స్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్స్పై అలర్ట్గా ఉన్నామని.. డ్రగ్స్ కట్టడి చేయడంలో మొదటి ప్రాధాన్యతతో ఉన్నామన్నారు.
రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్పై ఈ సమీక్షలో చర్చించామని వివరించారు. ఈగల్ ఫోర్స్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. డ్రగ్స్ విషయంలో సరఫరాతోపాటు డిమాండ్.. ఈ రెండింటిపై దృష్టి సారించామని పేర్కొన్నారు.
ఇక నుంచి యూనివర్సిటీలతోపాటు విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే ఆ బాధ్యత యజమాన్యాలదేనని డీజీపీ సీవీ ఆనంద్ కుండబద్దలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో అధికారులు డ్రగ్స్ కేసుల దర్యాప్తు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. జిల్లాల్లో డ్రగ్స్ కేసుల విచారణపై అధికారులకు ఈగల్ ఫోర్స్ ద్వారా శిక్షణ ఇస్తామని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్