ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం.. హరీష్ రావు
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం.. హరీష్ రావు
Harish Rao


యాదాద్రి భువనగిరి, 07 మే (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గురువారం సందర్శించారు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని పలువురు రైతులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించిన హరీశ్ రావు రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. వడ్ల కుప్పల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, మాయిశ్చర్ పరీక్షకు పది రోజులు, గన్నీ బ్యాగులకు మరో వారం, కాంటా పెట్టడానికి ఇంకో వారం పడుతోందని తెలిపారు. మిల్లులకు వెళ్లిన తర్వాత కూడా లారీకి 4 నుంచి 5 బస్తాల వరకు కటింగ్ పెడుతున్నారని ఆరోపించారు.

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్న ఆయన, చౌటుప్పల్ మార్కెట్లో వర్షం పడితే వడ్ల కుప్పలు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే మార్కెట్లకు లారీలు, గన్నీ బ్యాగులు పంపించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. యూరియా అమ్మకాలపై నిషేధం విధించడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande