సమాధానం చెప్పలేకే దాడులు.. బండి సంజయ్పై కేటీఆర్ ఫైర్
సమాధానం చెప్పలేకే దాడులు.. బండి సంజయ్పై కేటీఆర్ ఫైర్
KTR


కరీంనగర్, 07 మే (హి.స.)కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దాడులను తీవ్రంగా ఖండించారు. పట్టపగలు గూండాల్లా వచ్చి వాహనాలు, ఆఫీసుపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొల్పుతున్నారంటూ బండి సంజయ్పై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హేయమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మాట్లాడాం. పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. కళ్లముందే ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటు. సీఎం రేవంత్కు బీ-టీంగా మారిన బండి సంజయ్.. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొలుపుతున్నారు. ప్రతిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande