
కరీంనగర్, 07 మే (హి.స.)హుజురాబాద్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి.. పోలీస్స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను క్యాంప్ కార్యాలయంలో వేసి గేట్లు పెట్టేశారు పోలీసులు.
కేంద్ర మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు(గురువారం) ఉదయం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు పాడి కౌశిక్రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని కరీంనగర్ నుంచి హుజురాబాద్కు తరలించారు.
హుజురాబాద్ క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించారు. దీంతో వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు, కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఉండగానే బీజేపీ శ్రేణులు చొచ్చుకురావడంతో కౌశిక్ రెడ్డి అనుచరులు వారిపై కర్రలతో దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్