
ఖమ్మం, 07 మే (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని, వ్యవసాయ యాంత్రికరణ కోసం సబ్సిడీపై అందించే పరికరాలను రైతులు సద్వినియోగం పరుచుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. గురువారం గంగిదేవి పాడు సొసైటీ ఆఫీస్ వద్ద సొసైటీ చైర్మన్ తూము వీరభద్రరావు అధ్యక్షతన, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో తల్లాడ మండలానికి చెందిన రైతులకు 29 రకాల వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. మండల పరిధిలోని మూడు సొసైటీలకు 3 డ్రోన్లు, రోటవేటర్లు, స్ప్రే పరికరాలను రైతులకు సబ్సిడీపై అందించారు. ముఖ్యంగా రూ. 50 లక్షల పై ఉన్న వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లకు గాను ఎస్సీ,ఎస్టీ (సన్నకారు) రైతులకు 50 శాతం సబ్సిడీ, అదేవిధంగా (పెద్ద కారు రైతులకు) 40 శాతం సబ్సిడీ రాయితీ రావడంతో వివిధ రకాల వ్యవసాయ యాంత్రికరణ పరికరాలను ప్రజాప్రతినిధులు,రైతులతో కలిసి వారు స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లు కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పరికరాలను అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించారు. వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయడం మూలంగా తక్కువ దిగుబడితోపాటు అధిక ఖర్చు మూలంగా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారైన యంత్రాలు వాడకం ద్వారా సాగు వ్యాయామం తగ్గటంతో పాటు ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రతి యంత్ర పరికరం పై
ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రైతులకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తుందని పీఎం కుసుమ్ -A పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే విద్యుత్ ఉత్పత్తి చేసి అవసరానికి మించి మిగిలిన విద్యుత్ ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.1 లక్షకు 30 శాతం సబ్సిడీ కూడా అందిస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు