మంత్రిగా ఉండి ఇలా మాట్లాడతారా.. కొండా సురేఖపై రాజాసింగ్ ఫైర్
మంత్రిగా ఉండి ఇలా మాట్లాడతారా.. కొండా సురేఖపై రాజాసింగ్ ఫైర్
Raja singh


హైదరాబాద్, 07 మే (హి.స.)జై శ్రీ రామ్ అంటే పై నుంచి పైసలు పడతాయా అని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఎలా అంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండోమెంట్ మంత్రి అంటే దేవుడికి మినిస్టర్లాగా ఉండాలని.. కానీ కొండా సురేఖ ఏ శాఖకు మంత్రి..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ వేదికగా రాజాసింగ్ మాట్లాడారు. రేవంత్రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు జై శ్రీరాం అన్నారని ప్రస్తావించారు. మరి ఇప్పుడు తన మంత్రికి జై శ్రీరాం గురించి నేర్పించలేదా..? అని నిలదీశారు. జై శ్రీరాం అంటే కొండంతా బలం వస్తోందని...కానీ అనుచితంగా మాట్లాడితే మంత్రి పదవి పోతుందని ఆమెకు చెప్పాలని అన్నారు. తెలంగాణలో దేవుడి భూముల అమ్మకాలు, కబ్జాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నామని అన్నారు.

ఈ విషయంలో కొండా సురేఖ ఎలాంటి చర్యలు చేపట్టారు...? అని రాజాసింగ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దేవుడి భూములను ఎంఐఎం నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. దేవాదాయ శాఖ అధికారులు వారితో కుమ్మక్కై కమీషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి సర్కార్కి దేవాలయాల అభివృద్ధి మీద ధ్యాస లేదని ఆగ్రహించారు. ఎంఐఎం నేతలిచ్చే కమీషన్ల మీదనే ఈ మంత్రికి ధ్యాస ఉందని ఎద్దేవా చేశారు. రాముడి నామాన్ని ఎదిరించడానికి సాహసించేవారు.. ఎవరైనా గాల్లో కొట్టుకుపోతారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి, దయచేసి మీ దేవాదాయ శాఖ మంత్రిని పిలిపించి రాజీనామా చేయించాలని హితవు పలికారు. లేకపోతే మీరు కూడా కేసీఆర్ లాగా మునిగిపోతారని రాజాసింగ్ విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande