
కామారెడ్డి, 07 మే (హి.స.)
ధాన్యం లారీలను రైస్ మిల్లులో
వెంటవెంటనే అన్ లోడ్ చేయించాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జిల్లా సివిల్ సప్లై అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో కొనుగోలు చేసిన వరి ధాన్యంను ఒకే రైస్ మిల్ కు పంపడంతో లారీలు అన్ లోడ్ కాక రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారితో (DCSO)తో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ధాన్యాన్ని ఒకే రైస్ మిల్లుకు కేటాయించడం వల్ల లారీలు అన్ లోడ్ కాకపోవడంతో అనేక రోజుల పాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ధాన్యాన్ని ఒకే రైస్ మిల్లుకు కాకుండా మరిన్ని రైస్ మిల్లులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ధాన్యం వేగంగా క్లియరెన్స్ అవడంతో పాటు రైతులకు, లారీ యజమానులకు, కార్మికులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని రైతులకు ధాన్యం కొనుగోలులో, మిల్లులకు తరలింపులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే జిల్లా సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం లారీలను వెంటవెంటనే అన్లోడ్ చేయిస్తూ లారీలను కొనుగోలు కేంద్రాలకు సకాలంలో పంపాలని, సివిల్ సప్లై శాఖ అధికారులు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు