
నెల్లూరు,, 07 మే (హి.స.)
కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో మహానాడు ఏర్పాట్లకు వైభవంగా భూమి పూజ జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, నేతలు, శ్రేణులు తరలిరానున్నారు. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు రాష్ట్ర నేతలందరూ జిల్లాలోనే ఉంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. భవిష్యత్తుతరాలకు ఉపయోగపడేలా తీర్మానాలు ఉంటాయన్నారు. మొదటి రెండు రోజులు 20 వేల మంది డెలిగేట్స్ వస్తారని.. మూడో రోజు బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. బహిరంగ సభకు 7 లక్షలకు పైగా కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
నెల్లూరులో మొదటిసారి మహానాడు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్లో 2200 ఎకరాల స్థలం ఉందని.. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉండవని అన్నారు. పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అందర్నీ సమన్వయం చేస్తూ, సమష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV