
సిద్దిపేట, 08 మే (హి.స.)
ప్రజలు కులమనే సంకుచిత
భావజాలాన్ని వదిలి సమానత్వ భావనతో జీవించాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు సూచించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్ లో ఇటీవల చోటు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ కేసు ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఘటనకు సంబంధించి గజ్వేల్ ఏసీపీ నర్సింహులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి ఘటనకు సంబంధించిన పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకుని బాధితుల, సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సింహులు మాట్లాడుతూ.. సాంకేతికంగా ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కులాల పేరుతో వివక్ష, అవమానాలు జరగడం సమాజానికి మచ్చ అని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వివక్ష, బెదిరింపులు, దాడులు వంటి చర్యలను చట్టం తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. గ్రామాలలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ఇకపై ఎవరైనా కులాల పేరుతో దూషణలు చేయడం, సామాజికంగా అవమానించడం, వివక్షకు పాల్పడితే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదాలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..