రైతు సమస్యలపై భారాస పోరాటం ఉద్ధృతం
జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం: ఎర్రబెల్లి రైతు డిక్లరేషన్తో కాంగ్రెస్ మోసం: వేముల
BRS


హైదరాబాద్, 08 మే (హి.స.)రైతు సమస్యల పరిష్కారానికి భారాస పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందని, ఇందుకోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై మంత్రులు స్పందించడం లేదన్నారు. వరంగల్లో భారాస నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో ప్రభుత్వం రైతు మేళా పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతు మేళా పెట్టాలని డిమాండ్చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... గింజ ధాన్యం కూడా ప్రభుత్వం కొనలేదని, ఇంకెప్పుడు కొంటారో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ధాన్యం కుప్పల వద్దే పడుకునే పరిస్థితి వచ్చిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ రైతు మేళా అట్టర్ప్లాప్ అయిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. కేటీఆర్పై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మాజీ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు.

రైతు డిక్లరేషన్ పేరుతో రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు 900 రోజులు గడిచినా నెరవేర్చలేదన్నారు. కేటీఆర్ సభ తర్వాత కాంగ్రెస్ నేతలు తిట్ల రాజకీయాలకు దిగారని విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, బోనస్ హామీలు ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్లో దాడి ఘటనపై ఖండన

కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి వెంటనే అరెస్ట్ చేయాలని భారాస ఎల్పీ ఉప నేత ఎల్.రమణ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడలేక భాజపా నేతలు దాడుల రాజకీయాలకు దిగుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డా.కె.సంజయ్ ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande