నేపాలీ పనిమనుషులతో జర జాగ్రత్త : సీపీ సజ్జనార్ హెచ్చరిక
నేపాలీ పనిమనుషులతో జర జాగ్రత్త : సీపీ సజ్జనార్ హెచ్చరిక
Sajjanar


హైదరాబాద్, 08 మే (హి.స.)

హైదరాబాద్ నగరంలోని అత్యంత లగ్జరీ అండ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండే ప్రాంతమైన జూబ్లీహిల్స్ లో దారుణం చోటుచేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనిషే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు అత్యంత క్రూరంగా ఈ హత్యకు పాల్పడ్డారు. బాధితురాలి నోట్లో గుడ్డలు కుక్కి, ఆమె గట్టిగా కేకలు వేయకుండా అడ్డుకుని, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, కేవలం దోపిడీ కోసమే ఈ అఘాయిత్యానికి ప్రాథమికంగా పాల్పడినట్లు తెలుస్తోందని, హత్య అనంతరం నిందితులు పరారయ్యారని పేర్కొన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా నేపాలీ పనిమనుషులను ఇంట్లో పెట్టుకునే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. నేపాలీ గ్యాంగ్లు తరచుగా ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటాయని, వారు ఇంట్లో నమ్మకంగా ఉంటూనే యజమానుల కదలికలపై నిఘా పెడతారని సీపీ తెలిపారు. సరైన అవకాశం దొరికినప్పుడు దొంగతనం లేదా హత్యలకు వెనుకాడరని హెచ్చరించారు. ఇంట్లో పనిమనుషులు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనే విషయాలపై యజమానులు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నేపాలీ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పనిమనుషులను విధుల్లోకి తీసుకునే ముందు వారి ఆధార్ కార్డ్, ఫోటోలు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసి 'పోలీస్ వెరిఫికేషన్' చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా... రిటైర్డ్ ఉన్నతాధికారి ఇంట్లోనే ఇలాంటి ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande