గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు
ప్రతిపాదనలకు సీఎం రేవంత్రెడ్డి సూత్రప్రాయ ఆమోదం కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు
Godavari


హైదరాబాద్, 08 మే (హి.స.)రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో సుమారు 560 కి.మీ.ల పరీవాహక ప్రాంతం ఉన్న గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో కుంభమేళా తరహాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందు కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించగా అంతకు రెట్టింపు అంటే రూ.వెయ్యి కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి రూ.వెయ్యి కోట్లతో పనులకు మౌఖికంగా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రతిపాదనలకు సంబంధించిన దస్త్రం దేవాదాయశాఖ కమిషనర్ నుంచి ఆ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయానికి చేరింది. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ శ్రీధర్బాబు, ఇతర మంత్రుల దగ్గరికీ ఈ దస్త్రం ఒకట్రెండు రోజుల్లో వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం సంతకంతో కొద్దిరోజుల్లోనే నిధులు విడుదల అవుతాయని దేవాదాయశాఖవర్గాల సమాచారం.

2027 జులైలో జరిగే గోదావరి పుష్కరాలకు పుష్కర ఘాట్లు, రోడ్లు, ఆలయాల అభివృద్ధి సహా వివిధ రకాల పనుల్ని చేపట్టాల్సి ఉంది. దేవాదాయశాఖను నోడల్ ఏజెన్సీగా ఈ పుష్కరాలకు ప్రభుత్వం నియమించింది. ఏర్పాట్ల కోసం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనల్ని ఇప్పటికే తీసుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ల ద్వారా స్థానిక పరిస్థితులు, అవసరాల దృష్ట్యా అక్కడి నుంచీ ప్రతిపాదనల్ని స్వీకరించారు. మొత్తం రూ.6వేల కోట్ల పనులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ప్రాధాన్య క్రమంలో రూ.వెయ్యి కోట్ల పనులకు సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మిగతా రూ.500 కోట్లను ఆయా శాఖలకు కేటాయించిన నిధుల నుంచి వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీగా నిధులు అడగాలని నిర్ణయించినట్లు తెలిసింది. పుష్కరాల నిర్వహణకు దేవాదాయశాఖ కమిషనర్ను స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande