
కొమరం భీం ఆసిఫాబాద్, 08 మే (హి.స.) కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటారం మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రతిపాదిత ప్రాణహిత బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎత్తు, కాల్వల సామర్థ్యం తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులను ಅಡಿಗಿ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లేఖ రాశారని తెలిపారు.
వచ్చే వారం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయి బ్యారేజ్ ఎత్తుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలో ముంపుకు గురయ్యే ప్రాంతాలకు తగిన నష్టపరిహారం అందించి అక్కడి రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మళ్లించి అన్యాయం చేసిందని మంత్రులు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం అవసరమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహారాష్ట్ర అనుమతితోనే పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో కేవలం 5 వేల ఎకరాలు మాత్రమే ముంపుకు గురయ్యే అవకాశముందని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టును మేడిగడ్డ వైపు మళ్లించారని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు