ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి.. కేబినెట్ సబ్ కమిటీ
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.
Musi


హైదరాబాద్, 08 మే (హి.స.)ప్రజా భవన్లో మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు(శుక్రవారం) సమావేశమైంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అలైన్మెంట్ మార్పులు చేసి నిర్మాణాలపై ప్రభావం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టును మొత్తం 55 కిలోమీటర్ల మేర 5 దశల్లో అభివృద్ధి చేపట్టనున్నారు. ఫేజ్-1కు 7,055 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేశారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) నిధుల కోసం సాంకేతిక, ఆర్థిక చర్చలు పూర్తి అయ్యాయి.

హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. నదిలోని చెత్తను తొలగించి, రివర్ బెడ్ ప్రొఫైలింగ్ను ప్రభుత్వం చేపట్టనుంది. వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్స్ను నిర్మించనున్నారు. మూసీ రెండు వైపులా రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, నీటి నిల్వ కోసం బ్యారేజీలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.

ప్రాజెక్టు వివరాలను నగరవ్యాప్తంగా ప్రచారం చేయాలని సబ్ కమిటీ ఆదేశించింది. బస్టాండ్లు, ప్రధాన రోడ్లు, థియేటర్లలో ప్రచార వీడియోలు ప్రదర్శించనున్నారు. 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించడం లక్ష్యంగా నిర్ణయించారు. డిసెంబర్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక పర్యవేక్షణకు IIT, JNTUల సహకారం తీసుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande