75 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన యాదాద్రి భువనగిరి పోలీసులు
75 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన యాదాద్రి భువనగిరి పోలీసులు
Police


యాదాద్రి భువనగిరి, 08 మే (హి.స.)

జిల్లాలో పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను యాదాద్రి భువనగిరి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 75 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్ ఫోన్లు పోయిన వెంటనే బాధితులు సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడం వల్ల ఫోన్ల ట్రాకింగ్ సులభమైందని అధికారులు వివరించారు. పోయిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా సాంకేతిక బృందం ప్రత్యేకంగా పరిశీలించి వాటి లొకేషన్ ను గుర్తించినట్లు తెలిపారు.

జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో వినియోగంలో ఉన్న ఫోన్లు కూడా ట్రేస్ చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నెలల తరబడి ఆశలు వదులుకున్న తమ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పోయిన ఫోన్లు దొరకడంలో పోలీసులు చూపిన చొరవ పై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పలు సూచనలు చేశారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఫోన్ ఐఎంఈఐ నంబర్ను తప్పనిసరిగా భద్రంగా ఉంచుకోవాలని, అవసరమైతే వెంటనే బ్లాక్ చేయించుకోవాలని తెలిపారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande