
జగిత్యాల, 08 మే (హి.స.)
రైతులు కష్టాల్లో ఉంటే ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయడం తగదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం జగిత్యాల మార్కెట్ యార్డులోని తడిసిన మొక్కజొన్న వరి ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తడిసిన ధాన్యం ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
గత బీఆర్ఎస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదని అప్పటి సీఎం కేసీఆర్ రైతులు వరి సాగు చేస్తే ఉరే అన్నారని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ముందు చూపుతో సీఎం రేవంత్ ఫ్యూచర్ సిటీకి అభివృద్ధి చేస్తున్నారని ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా రాష్ట్రానికి వివిధ పనుల ద్వారా ఆదాయం పెరుగుతుందని మంత్రి అడ్లూరి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు