
వరంగల్, 08 మే (హి.స.)
దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన ఒక కీలక సాధనమని ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు అన్నారు. జనగణన 2027లో ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు వరంగల్-హనుమకొండలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ వరంగల్ లోని ఎంజీఎం జంక్షన్ నుంచి ప్రారంభమై, ములుగు రోడ్ జంక్షన్ గుండా హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి వరకు కొనసాగింది. ర్యాలీ మొత్తం దేశాభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను తెలియజేసే నినాదాలతో సాగింది.
ములుగు రోడ్ జంక్షన్ వద్ద మానవ హారం ఏర్పాటు చేసి, జనగణన-2027లో తప్పనిసరిగా పాల్గొని, మా కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకుని దేశ అభివృద్ధికి సహకరిస్తాం అంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి వివరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వనరుల పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. జనగణనలో ప్రజలు సరైన సమాచారం అందించడం ద్వారా ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు తెలిసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని కలెక్టర్ చహత్ బజపాయ్ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి జనగణన డేటా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్మించే ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, 2027 జనగణన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం అందించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..