గ్రామీణ ప్రాంతాల్లోనూ నగర స్థాయి విద్య..
గ్రామీణ ప్రాంతాల్లోనూ నగర స్థాయి విద్య..
Murali IAS


రంగారెడ్డి, 08 మే (హి.స.)

రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్లలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ను విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రభుత్వం విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు నిర్మించాలనే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో విద్యా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే అంశం పై స్వయంగా పాఠశాలలను సందర్శించి అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తే ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు.

ఇలాంటి ఉత్తమ ప్రమాణాలతో కూడిన పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం పేద విద్యార్థులకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందించడమేనని ఆయన పేర్కొన్నారు. విద్యా రంగంలో సమూల మార్పులకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు దోహదపడతాయని, గ్రామీణ ప్రాంతాల్లోనూ నగర స్థాయి విద్యా ప్రమాణాలు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. మంచాల మండలంలోని ఆరుట్ల పాఠశాల సందర్శన సందర్భంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా వసతులను పరిశీలించిన ప్రతినిధులు, భవిష్యత్లో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఈ తరహా పాఠశాలల విస్తరణతో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande