
హనుమకొండ, 08 మే (హి.స.)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై
బీఆర్ఎస్ విషం కక్కుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో 3 కోట్ల రూపాయలు నిధులతో నిర్మించిన సిసి రోడ్డు, రూ.48 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, ఎస్సీ, రజక, ముదిరాజ్ కమ్యూనిటీ హల్ ప్రహరీ గోడ మొత్తం రూ.3కోట్ల 62 లక్షల విలువైన అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆ అమలవుతున్న సంక్షేమ పథకాలను కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూన్నాయని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలులో రైతులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గన్ని బ్యాగుల కొరత, గోదాములు ఖాళీ లేక ధాన్యం కొనుగోలులో కొంత జాప్యం జరుగుతుందని దీనిని రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. అధికారంలో ఉన్నానాడు అడ్డగోలుగా దోచుకొని వందల ఎకరాలు, వేల కోట్లు, ఫామ్ హౌస్లు కట్టుకున్న వారే ఈ రోజు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వారు ఏం వెలగబెట్టారో మీ అందరికీ తెలుసు అన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను చేసిన అభివృద్ధి తప్ప మరేమీ లేదని తెలిపారు. ఆనాడు నేను వేసిన రోడ్లకు మళ్ళీ నేనే ఆ రోడ్లను అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. ఒక్కసారి పెద్ద పెండ్యాల గ్రామానికి వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు. కడియం శ్రీహరి ఏనాడూ తప్పు చేయడని, నీతిగా ఉంటాను, నిజాయితీగా పని చేస్తానని తెలిపారు.
పెద్ద పెండ్యాల గ్రామంలో చేసిన ప్రతి పని కడియం శ్రీహరి చేసిందే అని, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే పెద్దపెండ్యాలకు ఆరు వైపులా బిటీ రోడ్లు వేసానని తెలిపారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మసాగర్, తాటికాయల, కరుణాపురం, క్యాతంపల్లి, చిన్న పెండ్యాల రోడ్ల అభివృద్ధికి 37 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. అవే కాకుండా పెద్ద పెండ్యాల గ్రామంలో సిసి రోడ్లు, కమ్యూనిటీ హల్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి సుమారు రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..