
నెల్లూరు, 08 మే (హి.స.)
నెల్లూరు జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం వాశీలి సమీపంలో గేదెను తప్పించబోయిన కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నెల్లూరుకు చెందిన భాగ్యమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు.
అలాగే ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరంతా మైదుకూరులో నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమంలో పాల్గొని నెల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో, గ్రామంలో విషాదాన్ని నింపింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV