
సింగరాయకొండ, 09 మే (హి.స.)
మండలంలోని జాతీయ రహదారిపై విజయవాడ నుంచి బెంగళూరు వైపునకు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో శుక్రవారం అర్ధరాత్రి పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రహదారి పక్కన నిలిపివేశారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రవి, కానిస్టేబుల్ రాజేంద్ర అక్కడికి చేరుకుని బస్సులో ఉన్న 46 మంది ప్రయాణికులను కిందకు దించారు. బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు ఐదు గంటలపాటు వారంతా రోడ్డు పక్కనే ఉన్నారు. ట్రావెల్స్ బస్సు సిబ్బంది ప్రత్యామ్నాయంగా వాహనాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని వేరొక బస్సులో తమ గమ్య స్థానాలకు తరలించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ